అధికారంలో ఉన్నప్పుడు ఆధారాలతో విమర్శలు చేస్తే అందరికీ మంచిదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అన్నమయ్య జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఆధారాలు చూపకుండా ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత్ర ఉందంటూ అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ మధ్య వచ్చిన ఒక సినిమా సంఘటనను ఇతివృత్తంగా చేసుకొని అక్రమ ఎర్రచందనం రవాణాలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ల పాత్ర ఉందంటూ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు మీ దగ్గరకు వచ్చిన ఎర్రచందనం ఫైల్ పైన విచారించి ఆధారాలను బయట పెట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ చేగువేర లాంటి పెద్దలను ఆదర్శంగా చేసుకొని రాజకీయంగా తప్పులను ప్రశ్నిస్తానంటూ 2014లో రాజకీయ ప్రవేశం చేశారన్నారు. తొలినాళ్లలో టిడిపి, బిజెపిలను ప్రశ్నించారన్నారు. 2019లో పోటీ చేసి ఓటమి చెందారన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కూటమితో జతకట్టి అధికార పార్టీపై విమర్శలు చేశారన్నారు. కూటమితో కలిసి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చేగువేరా భావజాలాలతో ఉంటారని ప్రజలు ఆశించారు. సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పైన రాజకీయంగా సమీక్షలు చేసుకొని ముందుకు సాగుతారని అందరూ కోరుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం హోదాలో ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో నిజానిజాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.