రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం 12వ తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం దాకా టీడీపీ నేతలు చేసిన అరాచకాలు కోకొల్లలు అని నందిగం సురేష్ మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవడానికా? ప్రజలకు మేలు చేయడానికా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 5 నుంచి 6 శాతం ఓటింగ్ మారితే అధికారం తమ చేతిలో ఉండేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వచ్చేస్తోందన్నారు. కానీ, అవేవీ టీడీపీ నేతలకు కనపడటం లేదన్నారు. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అరాచకాలు చేస్తున్నారని, భారీ ర్యాలీతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా ఎంపీపీ ఇంటిని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేయాల్సిన పనిని ఎమ్మెల్యేలు చేయడం ఎంత వరకు సబబు అని నందిగం సురేష్ ప్రశ్నించారు. తప్పు ఉంటే అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారన్నారు. తగుదునమ్మా అని ర్యాలీగా కొంత మందిని తీసుకెళ్లి ఇళ్లు పడగొట్టే స్థితికి చేరుతున్నారంటే మనం ఎటు పోతున్నామో అర్థం చేసుకోవాలన్నారు.