యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను కర్నూలు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన ఓ యువతిని లైంగికంగా సహకరించాలని బలవంతం చేసినట్టుగా ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. దీంతో పాటు ఆ యువతి ఇటీవలే పోలీసులను ఆశ్రయించి మూడేళ్లుగా సుధాకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తాను భయపడి అప్పట్లో ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని, ఇప్పుడు మేజర్ కావడంతో ధైర్యంగా ముందుకు వచ్చినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌ను ఉదయమే కర్నూలు టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయన్ను కర్నూలు శివారులోని పంచలింగాలలోని జిల్లా జైలుకు తరలించారు.