టీడీపీ ఎంపీ పెద్ద మనసు చాటుకున్నారు.. తన తొలి జీతాన్ని విరాళంగా అందజేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తొలి జీతం రూ.లక్షా 57వేలను అమరావతికి విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని అమరావతికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. కలిశెట్టి అప్పలనాయుడు.. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లి అందరి దృష్టి ఆకర్షించారు. తొలిరోజు పంచె కట్టులో ఢిల్లీలోని నివాసం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన తర్వాత సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. లోక్‌సభలో తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు దేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపిన ఘనత అధినేత చంద్రబాబుకు దక్కుతుందన్నారు.
మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు రాష్ట్రానికి సంబంధించి అంశాలపై కేంద్రానికి విన్నవిస్తున్నారు. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఫీజ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అంతేకాదు ఇటీవల ఆయన మరో కీలక ప్రకటన చేశారు. స్వర్గీయ రామోజీరావు స్మారకార్థం తెలుగు పాత్రికేయులకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తానని తెలిపారు. తన కుమార్తె పేరుతో ఉన్న ట్రస్ట్ ద్వారా మీడియా ప్రతినిధులకు పురస్కారాలు ప్రదానం చేస్తానన్నారు.
ఈ పురాస్కారాలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తానని చెప్పారు. ఆ ప్రక్రియ మొత్తాన్ని త్వరగా పూర్తి చేసి.. రామోజీరావు పురస్కారాలు అందజేస్తానన్నారు. ఈ పురస్కారాలతో పాటుగా బహుమతిగా రూ.20వేలు ఒక పుస్తకం ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు వారు ఉంటున్న ప్రాంతంలో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.