శ్రీశైలంలో అద్భుతం జరిగింది.. భ్రమరాంబా సమేతుడై మల్లికార్జున స్వామి వెలసిన పుణ్యక్షేత్రలో పురాతనమైన మరో శివలింగం బయటపడింది. శ్రీశైలంలోని యాఫి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణం కోసం జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో పురాతన శివలింగం, నంది విగ్రహం తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగం పక్కన రాయిపై ఓ లిపిలో కొన్ని గుర్తులతో ఏదో రాసి ఉంది. శివలింగం బయటపడిందని తెలియగానే.. భక్తులు చూసేందుకు భారీగా తరలివచ్చారు. మహిళలు ఆ శివలింగానికి మహిళలు పూజలు నిర్వహించారు. శివలింగం బయటపడిందని తెలియగానే.. శ్రీశైల దేవస్థానం అధికారులు, పురోహితులు శివలింగాన్ని పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని పురావస్తుశాఖ అధికారులకు పంపించగా.. వారు పరిశీలించారు. శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం దగ్గర ఉన్న లిపి 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం దగ్గర ప్రతిష్టించినట్లుగా రాసి ఉంది. మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల సాయంతో.. ఇక్కడ ఉన్న లిపిలో సమాచారం తెలుసుకున్నారు.
మరోవైపు శ్రీశైలం మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్లకు భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు గత 28 రోజులలో సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ హుండీల ద్వారా మొత్తం రూ.3,98,34,583 నగదు రూపంలో ఆదాయం సమకూరింది. అలాగే 148 గ్రాముల బంగారం, 6.260 కేజీల వెండి కూడా హుండీల్లో భక్తులు కానుకలుగా సమర్పించారు. అలాగే 835 అమెరికా డాలర్లు, 105 కెనడా డాలర్లు, 106 మలేసియా రింగిట్స్, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 30 యూరోలు, 2 ఖతార్ రియాల్‌లు కూడా హుండీలో భక్తులు సమర్పించారు. ఆలయంలో పటిష్టమైన భద్రతా, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో ఈ హుండీ ఆదయాన్ని లెక్కించారు.
శాస్త్రోక్తంగా దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ
మరోవైపు ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జీర్ణోద్దరణ మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయంలో తిరువారాధన చేసి రక్షాబంధనం, కళాకర్షణంను అర్చుకులు జరిపారు. అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో ద్వార, పాలిక పూజ, సోమకుంభ, మహాకుంభ మండల స్థాపనం శాస్త్రోక్తంగా చేశారు. హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు అర్చకులు. అనంతరం వేదపండితులు వేదప్రబంధ పారాయణాలు పఠించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో ఈ పూజలను శాస్తోక్తంగా చేశారు.