చదువు విషయంలో అశ్రద్ధ వద్దన్నారు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు చాలా ముఖ్యమని.. విద్యార్థులంతా కష్టపడి చదవాలన్నారు. ఎమ్మెల్యే బేబీనాయన కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా బేబీనాయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.తన చదువు విషయంలో అమ్మకు ఇచ్చిన మాట తప్పానన్నారు బేబీనాయన. ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాను.. ఫలితంగా తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు. తాను చెన్నైలో పుట్టి పెరిగానని..బొబ్బిలి గడ్డపై ప్రేమతో బాల్యంలోనే అక్కడి నుంచి సొంత ఊరికి వచ్చేస్తానని గొడవ చేసినట్లు తెలిపారు. తన చదువు పూర్తికాకుండా వెళ్లొద్దని అమ్మ షరతు విధించారని.. ఆ సమయంలో తాను కచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తానని అమ్మకు మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
కానీ తాను బొబ్బిలిలో ప్రజాజీవితంలో బిజీగా ఉండటంతో.. చదువుకు ఆటంకం ఏర్పడింది అన్నారు. తాను ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచినా.. ఉన్నత చదువులు లేని కారణంగా మంత్రి పదవి రాలేదన్నారు. గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్‌ఆర్‌ఐ కొండపల్లి శ్రీనివాస్ ఉన్నత చదువులు చదువుకున్నారని.. ఆయనకు మంత్రి పదవి రావడం తనకు ఆనందంగానే ఉందన్నారు. ప్రతి ఒక్కరికి చదువు చాలా అవసరమని.. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలోనే నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు బేబీనాయన. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని..బీసీల కోసం అప్పట్లోనే గురుకులాలను ఏర్పాటు చేయడం ఓ కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు.కోమటిపల్లి గురుకులానికి సొంతస్ధలం, భవనం సమకూర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని.. ఇంటర్మీడి యట్ కోర్సు మంజూరు చేయాలని కూడా మంత్రి నారా లోకేష్‌ను కోరతానన్నారు. ఈ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తే బాగుంటుందని అక్కడి ప్రిన్సిపల్ కోరగా..గొల్లపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలని కూడా కోరారు. అయితే తాను ఆ దిశగా ప్రయత్నం చేస్తానని బేబీనాయన హామీ ఇచ్చారు.
బేబీ నాయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరాగా.. బేబీ నాయన విజయనగరం ఎంపీగా పోటీచేసి ఓడిపోగా.. సోదరుడు సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరగా.. సుజయ కృష్ణ రంగారావుకు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. 2019 ఎన్నికల్లో సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి నుంచి పోటీచేసి ఓడిపోయారు.. బేబీ నాయన మాత్రం పోటీచేయలేదు. ఆ తర్వాత మారిన పరిణామాలతో బేబీ నాయనకు బొబ్బిలి టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల్ని అప్పగించారు.. ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు.