రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రచార రథాన్ని తగులబెట్టిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు ఎవరో తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త, మాజీ ఎంపీ మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావుకు అనుచరుడు. శివాజీ భరత్ కార్యాలయం ఉన్న మార్గాని ఎస్టేట్స్ దగ్గర ఉండేవాడు. ఎన్నికల్లో భరత్ ఓటమిని శివాజీ మర్చిపోలేకపోయాడు.. టీడీపీ వాళ్లను ఏదో ఒకటి చేసి టార్గెట్ చేయాలని భావించాడు. ఏదైనా చేసి టీడీపీ వాళ్లపైకి నెపం నెట్టేయాలని.. అప్పుడు ప్రజల్లో భరత్‌పై సానుభూతి వస్తుందని ప్లాన్ చేశాడు. గత నెల 28న శివాజీ, మరికొందరు కలిసి రాత్రి 10 గంటల వరకూ మార్గాని ఎస్టేట్స్‌లోని రచ్చబండ దగ్గర మద్యం సేవించారు. అనంతరం అక్కడి నుంచి అందరు వెళ్లిపోగా.. శివాజీ మాత్రం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన బైక్ నుంచి పెట్రోల్‌ను ఓ కవర్‌లోకి తీశాడు. ఆ పక్కనే షాపు దగ్గరకు వెళ్లి దోమల కాయిల్, అగ్గిపెట్టు కొనుగోలు చేశాడు. దోమల కాయిల్ నుంచి చిన్న ముక్కను విరగ్గొట్టి.. దానికి నాలుగు అగ్గిపుల్లలు వెలిగే కొసను ప్లాస్టిక్ తాడుతో కట్టాడు శివాజీ.
భరత్ ప్రచార రథం దగ్గరకు వెళ్లాడు.. వాహనం టైరుపై పెట్రోలు ఉన్న కవర్‌ని పెట్టి.. దానిపై అగ్గిపుల్లలు కట్టిన భాగం ఉంచాడు. మరోవైపు దోమల చక్రం ముక్కను వెలిగించి శివాజీ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. మెల్లిగా దోమల కాయిల్ ముక్క వెలిగి అగ్గిపుల్లలు కూడా మండి పెట్రోల్ కవర్‌కు నిప్పు అంటుకుంది.. వెంటనే మంటలు అంటుకున్నాయి. నిమిషాల్లోనే మంటలు అంటుకుని.. వాహనం దగ్థమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు మంటల్ని ఆర్పేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఓ స్కూలు వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.. దీని ఆధారంగా కేసును ఛేదించారు. శివాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. అసలు విషయం బయటపడింది. శివాజీ యూట్యూబ్‌లో వీడియోలు వెతికి ప్రచార రథానికి ఎలా నిప్పు పెట్టాలో ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దోమల కాయిల్, పెట్రోల్ కవర్‌తో ప్లాన్‌ను అమలు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇలా చేసినట్లు గుర్తించామన్నారు. శివాజీ మార్గాని నాగేశ్వరరావుకు కాల్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. శివాజీపై గతంలో ఓ కేసు ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు.