ఒక పురుగు ధర రూ.75 లక్షలు అంటే మీరు నమ్మగలరా. పైగా అదేదో భారీ ఆకారంలో ఉంటుందా అంటే అదీ లేదు. చిన్నగా ఉండే ఆ పురుగు లక్షల్లో పలుకుతోంది. అది విన్న ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. పురుగుకు రూ.75 లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఒక రకమైన చెక్కను తిని జీవించే ఆ పురుగుకు అంత ధర ఎందుకు అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. దాని వల్ల ఏం ఉపయోగం అనేది ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు. స్టాగ్ బీటిల్ అనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగు గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా దీని విశేషాలు ఏంటంటే?
ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకంగా ఈ స్టాగ్ బీటిల్‌కు పేరుంది. ఈ స్టాగ్ బీటిల్ పురుగును అదృష్టానికి చిహ్నంగా అంతా భావిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందిన పురుగు. ఈ స్టాగ్ బీటిల్ అటవీ పర్యావరణంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. లండన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ స్టాగ్ బీటిల్ అనే పురుగు బరువు కేవలం 2 నుంచి 6 గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇది 3 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. మగ స్టాగ్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు.. ఆడ పురుగులు 30 నుంచి 50 మిల్లీ మీటర్ల పొడవులో ఉంటాయి.
ఈ పురుగుకు స్టాగ్ బీటిల్ అనే పేరు రావడానికి వెనక ఒక పెద్ద కథ ఉంది. ఈ స్టాగ్ బీటిల్స్‌కు ఉన్న కొండీలు.. మగ జింకల కొమ్ముల లాగా ఉంటాయి. అందుకే వీటిని స్టాగ్ బీటిల్స్ అని పిలుస్తారు. ఈ స్టాగ్ బీటిల్స్ అనే కీటకాలను రకరకాల చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. పైగా అదృష్టానికి గుర్తుగా కూడా భావిస్తుండటంతో దీనికి అంత ధర పలుకుతుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది. మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాగ్ బీటిల్స్‌తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ చిత్రమైన శబ్దాలు చేస్తాయి.
ఇక ఈ స్టాగ్ బీటిల్స్ కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లో వేడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి అస్సలు పడదు. ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తూ ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కుల వంటి జనారణ్య పరిసరాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎండిపోయిన చెట్ల బెరడును ఆవాసంగా చేసుకుని ఈ స్టాగ్ బీటిల్స్ నివసిస్తూ ఉంటాయి. చెట్ల నుంచి సాప్ అనే ద్రవాన్ని.. కుళ్లిపోయిన పండ్ల నుంచి వచ్చే తీపి స్రావాలను తిని పెద్ద స్టాగ్ బీటిల్స్ బ్రతుకుతాయి. లార్వాదశలో ఈ స్టాగ్ బాటిల్స్ తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తాయి. మొదటి దశలో తన పదునైన దవడలతో ఈ స్టాగ్ బీటిల్స్.. కలపను చీల్చి తింటాయి. కేవలం ఎండిపోయిన చెట్లనే తమ ఆహారంగా చేసుకుంటాయి.