చైల్డ్ పోర్నోగ్రఫీని నియంత్రించేందుకు స్పెయిన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే పోర్న్ సైట్లు, వీడియోలు చూసేందుకు పోర్న్ పాస్‌పోర్టును ప్రవేశపెట్టింది. 18 ఏళ్లలోపు పిల్లలు పోర్న్ చూడొద్దంటూ ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా ఉపయోగం లేకపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోర్న్ సైట్లు కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా కొత్త మొబైల్ యాప్‌ను తయారుచేసింది. పోర్న్ పాస్‌పోర్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్న్ పాస్‌పోర్టు సాయంతో పిల్లలు పోర్న్ సినిమాలు చూడకుండా నియంత్రించవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
స్పెయిన్‌లో పోర్న్ వెబ్‌సైట్లు చూసే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు డేల్ ఉనా వుల్టా అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. వారిలో అధికమంది మైనర్లు ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ విషయాన్ని డేల్ ఉనా వృల్టా సంస్థ స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో వాటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ పోర్న్ కంటెంట్ చూసేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో సగం మంది పోర్న్ వీడియోలను చూస్తున్నట్లు తేలిందని చెప్పారు. దీన్ని అడ్డుకునేందుకే తాము కొత్త ఆలోచనతో ముందుకు వచ్చి యాప్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
‘కార్టెరా డిజిటల్ బీటా’ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌ను స్థానికంగా ‘పజాపోర్టే’ అని పిలుస్తున్నారు. ఇది ఒక మొబైల్ వ్యాలెట్‌గా పనిచేస్తుందని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఈ పాస్‌పోర్ట్ కింద నెలకు ఒక్కొక్కరికీ 30 పోర్న్ క్రెడిట్స్‌ను స్పెయిన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఆ క్రెడిట్స్ సాయంతో పోర్న్ సైట్లలోకి లాగిన్ అయి చూసేందుకు అవకాశం ఉంటుంది. ఆ 30 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సి ఉంటే.. అదనపు క్రెడిట్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని కూడా ప్రభుత్వం ఉచితంగానే అందించనుంది. ఒక్కో క్రెడిట్‌కు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. వాటి ద్వారా పోర్న్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
స్పెయిన్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్లు కచ్చితంగా యూజర్ల వయసును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం తెచ్చిన యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పోర్న్ సైట్ల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడం.. అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన వారిని బయటికి తీసుకురావడం.. ఆన్‌లైన్ లైంగిక వేధింపుల కట్టడి కోసమే పోర్న్ పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి విధానాలతో ప్రభుత్వమే పోర్న్ వీడియోలను చూసేందుకు అనుమతి ఇచ్చినట్లు అవుతుందని మండిపడుతున్నారు.