ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్.. బైడెన్ సన్నిహితుడి సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 08:09 PM

అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రాట్లకు పెద్ద సమస్య వచ్చిపడింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన మొదటి డిబేట్‌లో అధ్యక్షుడు జో బైడెన్ కాస్త తడబడ్డారని.. అందుకే ఈ డిబేట్‌లో ట్రంప్ కంటే బైడెన్ వెనుకబడ్డారని వస్తున్న వార్తలు.. డెమోక్రటిక్ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసు నుంచి పక్కకు జరగాలంటూ జో బైడెన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే బైడెన్ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పోటీకి సంబంధించి బైడెన్‌ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన తెలిపారు.


అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకునేదే లేదని ఇప్పటికే జో బైడెన్‌ తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఆయన రేసు నుంచి వైదొలగాలనే డిమాండ్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే బైడెన్ పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై అతి కొన్ని రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని జోష్ గ్రీన్ శనివారం తెలిపారు. ఇటీవల బైడెన్‌తోపాటు ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశం అయిన జోష్ గ్రీన్.. ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం అమెరికాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇక ఈ క్రమంలోనే జోష్ గ్రీన్ సంచలన విషయాలను వెల్లడించారు. ఒకవేళ.. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగాలని భావిస్తే.. ఆ స్థానంలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని బైడెన్ భావిస్తే.. పోటీ నుంచి ఆయనే వైదొలగుతారని స్పష్టం చేశారు. బైడెన్‌కు సన్నిహితులుగా ఉన్నవారు కూడా పోటీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించినా పోటీపై ఆయన పునరాలోచిస్తారని జోష్ గ్రీన్ చెప్పారు. అయితే ఏ నిర్ణయాన్నైనా త్వరలోనే బైడెన్‌ వెల్లడిస్తారని మీడియాకు జోష్ గ్రీన్ తెలిపారు.


ట్రంప్ - బైడెన్ డిబేట్‌పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పిన జోష్ గ్రీన్.. ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని కఠిన సమయాలు ఉంటాయని.. మన ఇళ్లలోనే పెద్దవాళ్లు అప్పుడప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడంలో తడబడుతూ ఉంటారని సర్ది చెప్పారు. అంతమాత్రాన వారికి ఉన్న అనుభవం, తెలివితేటలు, కుటుంబంలో వారి పాత్రను తీసిపారేయలేమని పేర్కొన్నారు. ఇక ఇప్పటికీ తాను బైడెన్‌కు మద్దతుగానే ఉన్నానని జోష్ గ్రీన్ స్పష్టం చేశారు. బైడెన్ సామర్థ్యం గురించి అనుమానపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.


ఇక బైడెన్ కంటే ట్రంప్‌ వయసులో మరీ చిన్నవాడేమీ కాదని.. వారిద్దరికీ కేవలం 3 ఏళ్లు మాత్రమే వ్యత్యాసం అని చెప్పారు. అయినా అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదని.. పాలన సరిగ్గా చేయడం ముఖ్యమని జోష్ గ్రీన్ తెలిపారు. అర్ధరాత్రి పూట నిద్ర లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరం లేదని పరోక్షంగా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బైడెన్‌ అధ్యక్షుడిగా ఉంటే అలాంటివి ఉండవని పేర్కొన్నారు. బైడెన్‌ పోటీ నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరు ఉండాలదినే ఆయనకే వదిలేయడం బెటర్ అని గ్రీన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కమలా హ్యారిస్‌ పేరును ప్రతిపాదిస్తే డెమోక్రాట్లు మొత్తం సంతోషంగా ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె కంటే సమర్థులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com