తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వీఆర్వో.. ఎమ్మార్వోను బంధించిన ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో జరిగింది. ఘంటసాల మండలంలోని తహశీల్దారు కార్యాలయంలో మల్లీశ్వరి అనే మహిళ వీఆర్వోగా పనిచేస్తున్నారు. అయితే మంగళవారం విధుల కోసం ఆఫీసుకు వచ్చిన మల్లీశ్వరి.. ఏకంగా ఎమ్మార్వోనూ బంధించారు. ఎమ్మార్వో లోపల ఉండగానే తహశీల్దారు కార్యాలయం తలుపు గడియ పెట్టి ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ద్వారం వద్దే బైఠాయించారు. వీఆర్వో నిరసనకు తోడుగా ఆమె కొడుకు పెట్రోల్ తీసుకువచ్చి పోయటం.. అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. వీఆర్వో, ఆమె కొడుకు చర్యలతో పనుల కోసం కార్యాలయానికి వచ్చిన జనం విస్తుపోయారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. తన ప్రమేయం లేకుండానే తన పరిధిలోకి వచ్చే పనులను, పైళ్లను ఎమ్మార్వో, ఇతర వీఆర్వోల సహకారంతో చేయించుకున్నారని వీఆర్వో మల్లీశ్వరి ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించినా స్పందన లేదని చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చి తనకు న్యాయం చేయాలంటూ మల్లీశ్వరి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎమ్మార్వో విజయలక్ష్మి స్పందన మరోలా ఉంది. గత ఎమ్మార్వోకు, వీఆర్వో మల్లీశ్వరికి గొడవలు ఉన్నాయని ప్రస్తుత ఎమ్మార్వో విజయలక్ష్మి చెప్తున్నారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయని చెప్తున్నారు.
వీఆర్వో మల్లీశ్వరి ప్రవర్తన కారణంగా ఆఫీసులో ఇబ్బందులు వస్తుండటంతో ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేయాలంటూ ఆర్డీవో, కలెక్టర్‌కు రిపోర్టు కూడా ఇచ్చారని ఎమ్మార్వో విజయలక్ష్మి చెప్తున్నారు. ఇవన్నీ తెలిసే.. వీఆర్వో మల్లీశ్వరి ఈ రకంగా గొడవకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయానికి తలుపులు వేశారని చెప్తున్నారు. మరోవైపు ఎమ్మార్వో, వీఆర్వో వ్యవహారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం తహశీల్దారు కార్యాలయం వద్దకు వచ్చే స్థానికులు.. వీరి గొడవ కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఎమ్మార్వోను లోపల ఉంచి వీఆర్వో బంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.