ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జులై-16న జరగబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌లో హాలు వేదిక కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమై.. మధ్యాహ్నం 01:30 వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై చర్చించనున్నారు. దీంతో పాటు.. ఓట్ ఆన్ అకౌంట్‌పై ఇచ్చే ఆర్డినెన్స్‌కు సైతం కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సమాచారం అందుతోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నెలరోజులు కావస్తుండటంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనే భేటీలో ఎక్కువసేపు చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీకి సంబంధించి మంత్రులకు సమాచారం కూడా వెళ్లింది.