ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంది. మంత్రి చొరవతో రైతు సమస్యను మూడు గంటల్లోనే పరిష్కారమైంది. కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన రైతు గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు నేలను తాకాయి. ఈ కరెంట్ తీగలు పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరంగా మారాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తేవారు.. తర్వాత తీగల్ని అలా వదిలేవారు. ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు, ఎస్పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతు ఆరోపించారు. తాజాగా వర్షాలు పడడంతో రైతు గంగయ్య పొలంలో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం వెళ్లారు. మళ్లీ తీగలను కుటుంబ సభ్యులు పైకెత్తి.. దుక్కి చేశారు. ఈ క్రమంలో దారిన వెళుతున్న కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ విషయం విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన మంత్రి ఆ జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణతో ఫోన్లో మాట్లాడారు.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు సిబ్బంది ద్వారా విద్యుత్తు స్తంభాన్ని పొలానికి పంపించారు.. స్తంభాన్ని ఏర్పాటు చేసి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చూపించిన చొరవను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో రైతులకు మహిళా శాస్త్రవేత్తల సహకారం
కడప జిల్లాలో అన్నదాతలకు మహిళా శాస్త్రవేత్తలు సహకారం అందిస్తున్నారు. కడప శివారులో ఉన్న సీకేదిన్నె మండల పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని మహిళా శాస్త్రవేత్తలు అన్ని విభాగాల్లో రైతులకు అండగా నిలుస్తారు. రైతులకు వ్యవసాయంలో మెలకువలు నేర్పిస్తున్నారు.. అధిక దిగుబడులు సాధించేందుకు పంటలను పరిశీలిస్తూ కొన్ని సూచనలు చేస్తున్నారు.. సలహాలు ఇస్తుననారు. అంతేకాదు తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను ఉత్పత్తి చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని.. అందుకు తగిన విధంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయంటున్నారు.
రైతులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మహిళా శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేస్తున్నారు. రైతులకు మంచి విత్తనం అందిస్తే పంట దిగుబడులు బాగా వస్తాయి అంటున్నారు. అంతేకాదు చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు. ప్రస్తుతం కలుషిత ఆహారం తీసుకుంటుండటంతో రోగాల బారినపడుతున్నారని గుర్తు చేశారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పోషకాహారంపై శిక్షణ ఇస్తున్నారు. చిరుధాన్యాల వంటలతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చు అంటున్నారు.