చెత్తను 12 గంటల్లోపు సేకరిస్తే సంపద అవుతుందని, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ గ్రామాల స్వయం సమృద్ధికి ఎంతో దోహదకారి అవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో ‘ఘన, ద్రవ వనరుల నిర్వహణ (ఎస్‌ఎల్‌ఆర్‌ఎం)’కు సంబంధించి స్వచ్ఛాంధ్ర సంస్థ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,301 గ్రామపంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఏటా రూ.2,643 కోట్ల ఆదాయం గడించవచ్చని, ఈ నిధులతో ఆయా పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నదులు, సంప్రదాయాలు, పంచభూతాలకు విలువనిచ్చి గౌరవించే దేశం మనదని గుర్తుచేశారు. అవి కలుషితం కాకుండా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మనం పూజించే ఆవులు ప్లాస్టిక్ కవర్లు తిని చనిపోతున్నాయని, చెత్త నిర్వహణ లేకపోతే అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఘన, ద్రవ వ్యర్థాలను సంపదగా మార్చేందుకు శ్రీనివాసన్ దశాబ్దాలుగా శ్రమించారని తెలిపారు. పిఠాపురంలోని 54 పంచాయతీల్లో స్వయం సహాయక బృందాలతో రోజుకు రెండుసార్లు పొడి, తడి చెత్తను సేకరించి, నిర్వహణ చేపడతామని చెప్పారు.ఈ విషయంలో ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఘన, ద్రవ వనరుల నిర్వహణపై అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. ముందుగా తన క్యాంపు ఆఫీసు వద్ద మొదలుపెట్టి చెత్త తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, దానికి పలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక ఒక ఐఏఎస్ అధికారి పేరు వినిపిస్తోందని చెప్పారు. ఆ అధికారిపై ఏం చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకున్నంత మాత్రాన ఎంతవరకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఏఐఐబీ రోడ్ల కోసం రుణం మంజూరుచేస్తే 30శాతం రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో బ్యాంకు డబ్బులు విడుదల చేయక పనులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జీఎ్‌సటీ భారం పెరగడమే కాకుండా రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు నిలిచిపోయిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ డిసెంబరు వరకూ పనులు చేసేందుకు అనుమతి లభించిందని చెప్పారు. ప్రతినెలా రూ.200 కోట్లు ఖర్చు చేస్తే దానిని రీయింబర్స్ చేస్తామని ఏఐఐబీ చెబుతోందని వివరించారు. అంతకుముందు ‘వేస్ట్ టు గోల్డ్’ అనే కాన్సె్‌ప్టతో ఘన, ద్రవ వనరుల నిర్వహణపై కన్సల్టెంట్ శ్రీనివాసన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.