వాహనదారులకు ఇదో శుభవార్త. జగన్ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో పడిన ఇబ్బందులకు కూటమి సర్కారు చెక్ పెట్టే కార్యక్రమానికి తెరదీసింది. రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేసి చక్కటి ప్రయాణానికి వీలుగా వాటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ను ఆదేశించింది. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్ విద్యుత్ ప్లాంట్ల నుంచివచ్చే బూడిద(ప్లైయాష్) వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. శాస్త్ర, ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రహదారులపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీరింగ్ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి, నయీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయినట్లు తెలిసింది. ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారు? గతంలో అసలు ఏ పనీచేయలేదా? అని ఆరాతీశారు. జగన్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 4,151 కిలోమీటర్ల రోడ్లపై తక్షణమే మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని, మరో 2 వేల కిలో మీటర్ల మేరకు రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీనికిగాను కనీసం రూ.350 కోట్లపైనే నిధులు అవసరం ఉంటుందని సీఎంకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.