సమాజంలో రోజురోజుకూ నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసులకు దొరకకూడదనే ఆలోచనలతో కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. అలానే ఓ ప్రబుద్ధుడు పోలీసులకు మస్కా కొట్టాలనుకున్నాడు. ఖాకీ చొక్కాలకు దొరకకూడదనే ఉద్దేశంతో ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. అయితే మనోడి ప్లాన్ అడ్డం తిరిగి.. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో జరిగింది. మనోడి తెలివిని చూసిన పోలీసులు తొలుత షాక్ తిన్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామానికి చెందిన వన్నూరు స్వామి అనే వ్యక్తి ఓ తోటకు కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. తోటలో బంతిపూలు, కనకాంబరాలు సాగుచేస్తున్నారు. అయితే గంజాయి మత్తుకు అలవాటుపడిన వన్నూరు స్వామి.. ఆ కనకాంబరాల మొక్కల మధ్యనే గంజాయి మొక్కలు నాటాడు. కనకాంబరాలు, బంతిపూల మధ్యన నాలుగు గంజాయి మొక్కలు నాటిన వన్నూరు స్వామి.. వాటిని పీలుస్తూ మత్తులో తేలిపోయేవాడు. అయితే మనోడు సాగిస్తున్న ఈ వ్యవహారం ఆ పూలతోట యజమానికి కూడా తెలియదట. కానీ ఊహించని రీతిలో మనోడి పత్తాపారం బయటపడింది.
టి. వీరాపురం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ ఎవరో ఆకాశ రామన్న పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వన్నూరు స్వామి పనిచేస్తున్న తోట దగ్గరకు వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి షాక్ తిన్నారు. పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలను గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే ఆ మొక్కలు పెంచుతున్న విషయాన్ని వన్నూరు స్వామి అంగీకరించాడు. అనంతరం నిందితుడి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్నూరు స్వామిని అరెస్ట్ చేశారు.
అయితే తన తోటలో గంజాయి మొక్కలు సాగు చేసిన సంగతి తనకు తెలియదని ఆ తోట యజమాని చెప్తున్నారట. పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలు నాటి అతి తెలివితో వ్యవహరించిన వన్నూరు స్వామి.. అలా అనుకోకుండా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇలా సాగుచేసిన గంజాయిని వన్నూరు స్వామి మాత్రమే సేవిస్తున్నాడా.. బయట వ్యక్తులకు కూడా విక్రయించేవాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.