విధి చాలా బలీయమైనదని పెద్దలు అంటుంటే వింటుంటాం. అంటే మనం ఎన్ని అనుకున్నా... ఎన్ని కలలు కన్నా.. విధికి అవసరం లేదు, వాటితో దానికి పనిలేదు. విధాత ఎలా రాసి ఉంటే అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి విధి ఆడే వింత నాటకాలు గుండెను బరువెక్కిస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది. తెల్లారితే తమ కల సాకారమవుతుందనే సంతోషంతో నిద్రపోయింది ఓ జంట. కానీ విధిరాత మరోలా రాసి ఉంది. కన్న కలను కళ్లారా చూసుకోకుండానే దంపతులు ఇద్దరూ కాలం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మారెప్ప, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఈ ప్రమాదంలో కన్నుమూశారు. వారి వద్దనే నిద్రపోతున్న కుమార్తె మానస, మరో కుటుంబసభ్యుడికి గాయాలయ్యారు. శనివారం రాత్రి హవళిగిలో వర్షం కురిసింది. ఈ వర్షానికి పై కప్పు కూలి.. దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే సొంతింటి కోసం తపించిన మారెప్ప దంపతులు.. చాలా కష్టపడి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆదివారం నూతన గృహప్రవేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇంతలోనే మృత్యువు కబలించింది. తెల్లారితే గృహప్రవేశం అనగా.. గాఢనిద్రలోనే కన్నుమూశారు.
మరోవైపు మారెప్ప దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైస్ మిల్లులో పనిచేసే మారెప్ప ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారని.. తెల్లారిస్తే గృహప్రవేశం అనగా ఇలా జరగడం ఏంటని వాపోతున్నారు. గృహ ప్రవేశం కోసం తెచ్చుకున్న సామాను కూడా పెంకుటిల్లులో ఉంచారని చెప్పారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే భార్యభర్తలు బతికే వాళ్ళంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి వారిపై ఇలా పగబడుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాద సమయంలో ఇంటి బయట పడుకున్న మారెప్ప కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. దంపతులు ఇద్దరూ చనిపోగా, కుమార్తెకు గాయాలయ్యాయి.