అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. ఆ సందర్భంగా తన స్నేహితుడిపై కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని ముక్త కంఠంతో తేల్చి చెప్పారు.
ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల ట్విటర్‌లో స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు ఎలాంటి చోటు లేదు. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటులేదని స్పష్టం చేశారు. పెన్విల్వేనియాలోని ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై తనకు సమాచారం వచ్చిందని.. అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందని బైడెన్ వెల్లడించారు. ట్రంప్‌ను కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నవారంతా క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి హింసాత్మక సంఘటనలను ఖండించేందుకు యావత్ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని బైడెన్ తేల్చి చెప్పారు
ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. ఈ కాల్పుల్లో ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని తెలిసి ఊరట చెందినట్లు చెప్పారు. ట్రంప్‌తో పాటు ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ట్రంప్‌ను కాపాడిన సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి హింసకు అమెరికాలో స్థానం లేదని.. అందరూ ఈ చర్యను ఖండించాలని కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఈ ఘటన మరింత హింసకు దారితీయకుండా చూసేందుకు అంతా కృషి చేయాలని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై.. ఆదివారం పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ట్రంప్ చెవి పైభాగంలో బుల్లెట్ తగిలి గాయం అయింది. దీంతో వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. దుండగుడిని కాల్చి చంపారు. అనంతరం ట్రంప్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. తర్వాత ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.