ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ దాదాపుగా సిద్ధమైంది. వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో పవన్ కళ్యాణ్‌కు పేషీ కేటాయించారు. పవన్ కళ్యాణ్ పేషీలో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నీచర్, కొత్త రంగులు, హంగులతో మెరుగులు దిద్దారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఈ పేషీని కేటాయించారు.
ఈ పేషీ కోసం గతంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ప్రయత్నించారు.. ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ రావడంతో పయ్యావుల స్పందించారు. పేషీల విషయంలో ఎలాంటి వివాదం లేదని కేశవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ పేషీల గురించి తాను ఎవరితో మాట్లాడలేదన్నారు పయ్యావుల. తనకు ఇది కావాలని ఎవరినీ అడగలేదని.. ప్రభుత్వం తనకు ఏ పేషీ కేటాయిస్తే అది తీసుకుంటాను అన్నారు. పవన్ కళ్యాణ్ పేషీ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పేషీ తీసుకోవచ్చన్నారు.
సచివాలయం రెండో బ్లాక్‌లో ఫైనాన్స్ అని ఉన్న స్టిక్కర్ ఎప్పటిదోనని.. గతంలో ఇక్కడ ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఉండేవని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌కు ఆ పేషీ కావాలంటే తీసుకోవచ్చు అన్నారు. పవన్‌కు ప్రాధాన్యం ఉంటుందని.. పేషీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి పయ్యావుల.
సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ముందుగా 212, 214 పేషీలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. ఆ తర్వాత ఆ పేషీ తనకు కావాలని ఆర్థిక మంత్రి కావాలని అడిగినట్లు చర్చ జరిగింది. పవన్‌కు 211 పేషీ కేటాయించినట్లు వార్తలొచ్చాయి. దీంతో పయ్యావుల స్పందించి పేషీల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సచివాలయంలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని భావించారు.. కానీ పేషీ సిద్ధం కాకపోవడంతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేషీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఆ పేషీ నంబర్‌కు ఏదైనా సెంటిమెంట్ ఉందా అనే చర్చ జరుగుతోంది. 212, 214 నంబర్ల గురించి కొందరు ఆరా తీస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ త్వరలోనే వెలగపూడి సచివాలయంలోని తన పేషీలో అడుగు పెట్టనున్నారు. అంతేకాదు జనసేన పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ల పేషీలు.. పవన్ కళ్యాణ్ పేషీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారని టాక్ వినిపించింది.