ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చొరవ ఓ వ్యక్తి ప్రాణం కాపాడింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. నారా భువనేశ్వరి బుధవారం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇక అదే విమానంలో ప్రయాణిస్తున్న శశిధర్ అనే ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటంతో శశిధర్ ఇబ్బందులు పడ్డారు. అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి ఈ విషయాన్ని గమనించారు. వెంటనే స్పందించిన భువనేశ్వరి విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు.
సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన సమాచారంతో సీఎంవో కూడా అంతే వేగంగా స్పందించింది. ఈ విషయమై విమానాశ్రయ అధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు మాట్లాడారు. సీఎంవో ఆదేశాలతో విమానాశ్రయ అధికారులు సత్వరమే స్పందించారు. విమానం వద్దకే వైద్యులను, అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. విమానం ల్యాండ్ కాగానే వెంటనే శశిధర్‌కు చికిత్స అందించారు. వైద్య చికిత్స సకాలంలో అందడంతో శశిధర్ కోలుకున్నారు. దీనిపై నారా భువనేశ్వరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ ఘటనలో నారా భువనేశ్వరి వ్యవహరించిన తీరు పట్ల విమానంలోని ప్రయాణికుల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు నారా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ.. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని నారా భువనేశ్వరి.. ఇటీవల టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సమయంలో.. భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపం చెంది చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చారు. ఇక ఎన్నికల ప్రచారం సమయంలోనూ నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువయ్యారు భువనేశ్వరి. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. దీంతో నిజం గెలిచింది.. ప్రజాపాలన మొదలైందని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa