ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉండాల్సిన చంద్రబాబు ఎందుకు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హమీల అమలు గురించి కేంద్రాన్ని నిలదీయకుండా.. వారికి ఎందుకు సలాంమ్ కొడుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ షర్మిల.
" అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీహుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. ప్రధాని మోదీతో గానీ , ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు? " అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
"గెలిచిన రోజు నుంచి చంద్రబాబు నాలుగుసార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్ట్‌కి నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా? ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న. దాటక బోడి మల్లన్న“. ఇదే బీజేపీ సిద్ధాంతం. చంద్రబాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటోదని గుర్తిస్తే మంచిది" అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం గురించి.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి చంద్రబాబు, అమిత్ షాతో చర్చించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని కూడా చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారంపైనా ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలిసింది.