కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేంద్రంలో మరో గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్మోహన్ నాయుడికి మరో బాధ్యతలు అప్పగించారు. నీతి ఆయోగ్‌లో ప్రత్యేక ఆహ్వానితుడిగా రామ్మోహన్ నాయుడుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కేంద్రంలో నూతన మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కేంద్రం సవరించింది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకి స్థానం కల్పించారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కుమారస్వామి, జీతన్‌రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జుయెల్ ఓరం, అన్నపూర్ణాదేవిలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రివర్గంలో అత్యంత పిన్నవయస్కులు రామ్మోహన్ నాయుడే. 36 ఏళ్లకే ఆయనను కేబినెట్ మంత్రి పదవి వరించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన రామ్మోహన్ నాయుడు.. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ మీద 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ గెలుపొందారు. అనంతరం మోదీ మంత్రివర్గంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా రామ్మోహన్ నాయుడును కేంద్రం నియమించింది.
టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. 2012లో ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో.. రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్లలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు.. 16వ లోక్ సభలో పిన్న వయస్కులైన ఎంపీలలో రెండో వారిగా గుర్తింపు పొందారు. ఇక 2019 వైసీపీ వేవ్‌లోనూ శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు.. 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆంగ్లం, హిందీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం, సబ్జెక్ట్ ఉండటంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి వరించింది.