ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 19వ తేదీన పవన్ కళ్యాణ్ హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు.ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే జలజీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో.. కేంద్రం ఈ జల జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోందనే దానిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న సీఆర్ పాటిల్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ తరుఫున పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర మంత్రి సమీక్షలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు ఏపీ గ్రామీణాభివృద్ధి్, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. విపక్షంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల సమస్యలను స్వయంగా పరిశీలించిన జనసేనాని.. సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అందుకే మంత్రివర్గంలోనూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు మంగళవారమే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లివచ్చారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాత్రి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం సహా ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు.. అమిత్ షాను కోరారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైనా చంద్రబాబు, అమిత్ షా భేటీలో చర్చించినట్లు తెలిసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది,