ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ విశాఖవాసులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏపీ పర్యాటకశాఖ స్పెషల్ టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ప్రతి రోజూ మధ్యాహ్నం నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఏసీ బస్సులు నడుపుతున్నారు. ఈనెల 19 నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఏసీ బస్సు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకుంటుంది.
పర్యాటకశాఖ తీసుకొచ్చిన ఈ ప్యాకేజ్‌లో తిరుమల శ్రీవారి దర్శనం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. మళ్లీ తిరుపతిలో బస్సు బయల్దేరి విశాఖకు తిరిగి చేరుకుంటుంది. ఈ తిరుమల టూర్ ప్యాకేజ్‌కు పర్యాటన శాఖ ప్రత్యేక ధరలను నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ. 6,300, పిల్లలకు రూ. 6,000గా టికెట్ ధరను నిర్ణయించారు అధికారులు. విశాఖపట్నం నుంచి తిరుమలకు వెళ్లాలనుకునేవారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
తిరుమల ఆణివార ఆస్థానం, పుష్పపల్లకీ సేవ
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్ బాబు, తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.