కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల రద్దీ పెరిగిన విధంగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. 2024లో మొదటి ఆరు నెలల్లోనే శ్రీవారి హుండీకి రూ. 670.21 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. శ్రీవారి హుండీకి జనవరిలో రూ 116.46 కోట్లు ఆదాయం రాగా.. ఫిబ్రవరి నెలలో ఇది కాస్త తగ్గింది. ఫిబ్రవరిలో శ్రీవారి హుండీకి రూ 111.71 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక మార్చి నెలనాటికి ఆదాయం మరింత పెరిగింది. మార్చి నెలలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ 118.49 కోట్లుగా అధికారులు తెలిపారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 101. 63 కోట్లుగా అధికారుల లెక్కల్లో తేలింది. మే నెలలో రూ 108.28 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. జూన్ నెలలో రూ 113.64 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తంగా 2024 మొదటి 6 నెలల్లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.670.21 కోట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.దర్శనానికి 8 గంటల వరకూ సమయం పడుతోంది. శ్రీవారిని మంగళవారం 71,409 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.
శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టువస్త్రాలు
మరోవైపు తిరుమల శ్రీవారికి శ్రీరంగం నుంచి పట్టువస్త్రాలు అందాయి. శ్రీరంగం శ్రీరంగనాథస్వామి తరుఫున ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీరంగం అధికారులు.. స్వామివారికి పట్టుపస్త్రాలు బహూకరించారు. తొలుత ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మాడవీధుల గుండా ప్రదక్షిణ చేసి అనంతరం ఆలయంలో స్వామివారికి సమర్పించారు.