ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీలో విబేధాలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య పొసగడం లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి లేకుండానే ఒంటరిగా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి.. వేర్వేరుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం.. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన ట్వీట్ మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సీఎం పోస్టుకు గండం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో ఒంటరిగా భేటీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలోనే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీరిద్దరూ వాటి గురించే గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక యూపీలో సీఎం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. కానీ ఉప ఎన్నికల గురించి సీఎం లేకుండా డిప్యూటీ సీఎంతో జేపీ నడ్డా చర్చించడం ఏంటనే వాదన తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన ట్వీట్.. మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని పేర్కొన్నారు. పార్టీలో కార్యకర్తల బాధ తన బాధ అని.. పార్టీ కంటే ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాదని ట్వీట్ చేశారు. కార్యకర్తలే పార్టీకి గర్వకారణమని స్పష్టం చేశారు. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించే.. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. ఈ ట్వీట్ చేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే గతంతో పోల్చితే అంచనాలకు భిన్నంగా ఇటీవల యూపీలో లోక్‌సభ ఫలితాలు వచ్చాయి. ఇక ఉప ఎన్నికల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి యోగి ఆదిత్యనాథ్ పనితీరు, తీసుకున్న నిర్ణయాలే కారణమని.. బీజేపీ హై కమాండ్‌కు పార్టీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ అతి విశ్వాసమే.. ఓట్లు కోల్పోయేలా చేసిందని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా జేపీ నడ్డాతో వేరుగా సమావేశమైనట్లు తెలుస్తోంది. యూపీ బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని భూపేంద్ర చౌదరికి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక యూపీ బీజేపీలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు బయటకు రావడంతో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ అంతర్గత విభేదాల ఊబిలో చిక్కుకుపోయిందని.. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించడం మానేసిందని విమర్శించారు.