వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లి నుంచి వినుకొండకు వెళ్లనున్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైయస్ జగన్ వినుకొండ చేరుకుంటారు. టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైయస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. హింసాత్మక విధానాలు వీడాలని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును వైయస్ జగన్ హెచ్చరించారు. ఏపీలో ఆటవిక పాలనపై ప్రధాని మోదీకి వైయస్ జగన్ లేఖ రాశారు. ఏపీలో గడిచిన 40 రోజులగా జరుగుతున్న హత్యాకాండలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.