దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని అన్నారు . 50 రోజుల కాలంలో 34 మంది వైయస్ఆర్సీపీ నేతల ఆస్తులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైయస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పులివర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేసినట్టు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్‌గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే. పులివర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇన్ని డ్రామాలు చేస్తుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోంది. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి నాని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్‌తోనే ఉంటాను అని చెప్పారు.