ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన, మన అనే విషయాన్ని కూడా చూడను. వైసీపీ హయాంలో నన్నే జైలుకు పంపారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే నేనూ చేయగలను. కానీ కక్ష సాధింపు వ్యవహారాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలూ కక్ష పూరితంగా వ్యవహరించొద్దు. రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు. శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దు. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తాం. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాలేదు.. అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారు. ఆయన తన సహజ ధోరణి వీడలేదు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా?. తప్పులు చేయడం.. పక్క వారిపై నెట్టేయడం ఆయనకు అలవాటుగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసును వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు. వినుకొండలో హత్య కేసులోనూ ఇదే జరుగుతోంది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనం. అర్థరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకూ జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదు. నిధులు లేవని పనులు చేయలేం అని చెప్పలేం. నిధుల విషయంలో ఇబ్బందులున్నా పనులు చేయాలి. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదాం" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa