రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు నిరసనగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, 50 రోజులుగా కొనసాగుతున్నహత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అత్యాచారాలన్నింటినీ యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నేడు ఉదయం 10 గంటలకు వైయస్ఆర్ సీపీ ధర్నా ప్రారంభం కానుంది. ఈ ధర్నాలో రాష్ట్రంలో గత 50 రోజులుగా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై జరిగిన హత్యలు, విధ్వంసాలు, దాడులను యావత్ దేశ ప్రజలంతా చూసేలా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఆటవిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయనున్నారు. ఈ ధర్నాలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.