అల్లూరి జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. రెండు రోజులుగా అరకు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో మంచి నీటి కోసం ప్రజలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఫోన్లు మూగనోము పట్టాయి. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్, ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.