రామభద్రపురం మండల అభివృద్ధి అధికారిగా గతంలో పనిచేసిన రమామణిపై శుక్రవారం ఉపాధిహామీ పథకం విజిలెన్స్ అధికారి వెంకటరమణ విచారణ చేపట్టారు. మిర్తివలస గ్రామానికి చెందిన గిరడ షణ్ముఖరావు ఫిర్యాదు మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ బహిరంగ విచారణ జరిగింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన రమామణి సుమారు రూ.9 లక్షలు అవినీతికి పాల్పడ్డారని షణ్ముఖరావు ఈ ఏడాది జనవరి 12న రాష్ట్ర లోకాయుక్తా, విజిలెన్స్ కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశాడు. ఎంపీడీవో తన ఆఫీసు నుంచి పంచాయతీలకు కారులో వెళ్లకుండా 5 కిలోమీటర్లు లోపు ఉన్న దానికి వంద నుంచి 250 కిలోమీటర్లు తిరిగినట్టు లాక్‌బుక్‌లో నమోదుచేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఈ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్లు షణ్ముఖరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై లోకాయుక్తా ఆదేశాల మేరకు ఉపాధిహామీ పథకం విజిలెన్స్ అధికారి వెంకటరమణ, ప్రస్తుత ఎంపీడీవో చుక్కా ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవోపై విచారణ చేపట్టారు. దీనిపై ఎంపీడీవో రమామణి మాట్లాడుతూ.. తాను నిధులు దుర్వినియోగం చేయలేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ఒక పంచాయతీకి ఐదు నుంచి ఆరుసార్లు వెళ్లానని స్పష్టం చేశారు. అధికారులకు ఒక కారు చూపించి వేరే కారులో తిరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆమె ప్రభుత్వ సొమ్మును తీసుకున్నారని ఫిర్యాదుదారుడు షణ్ముఖరావు చెప్పాడు. దీనిపై లోతైన విచారణ జరిపి ఎంపీడీవో నుంచి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయడమే కాకుండా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె పనిచేసిన కాలంలో ప్రజాప్రతినిదులకు కనీస గౌరవం ఇవ్వకుండా సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారని రొంపల్లి ఎంపీటీసీ భవిరెడ్డి శంకరరావు విచారణ అధికారి దృష్టికి తెచ్చారు. ఇక్కడ జరిగిన విచారణనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని విజిలెన్స్ అధికారి వెంకటరమణ తెలిపారు.