కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఆ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఓటర్ జాబితాల రూపకల్పనకు షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ నమోదు చేయడం అనేది ఓటరు ఇష్టం.సెప్టెంబరు 30వ తేదీన ఓటర్ జాబితాల రూపకల్పనకు నోటిఫికేషన్‌ని విడుదల చేస్తారు. అక్టోబరు 16న మరోసారి రీపబ్లికేషన్ చేస్తారు. అక్టోబరు 25న రెండో రీపబ్లికేషన్ చేస్తారు. నవంబరు 6వ తేదీ వరకు ఫారం-18, 19లో దరఖాస్తులు స్వీకరిస్తారు.నవంబరు 20వ తేదీ లోపు ముసాయిదా ఓటర్ల జాబితాలను ముద్రిస్తారు.నవంబరు 23వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితాలు ప్రకటిస్తారు. నవంబరు 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.డిసెంబరు 25వ తేదీన క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించి సప్లిమెంట్ ఓటర్ జాబితాలను ముద్రిస్తారు.డిసెంబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితాని ప్రచురిస్తారు.