రాయలసీమ వెనుకబాటు తనాన్ని మోదీకి వివరించి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు సఫలీకృతులయ్యారని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల నాగేంద్రలతో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో సీమ జిల్లాలోని వలసలు, కరువులు నివారించేందుకు సీఎం. చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చోరవ చూపడం అభినందనీయమన్నారు. సీఎంగా చంద్రబాబు తనకున్న అనుభవంతో ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌ను గుర్తించి ప్రత్యేక నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గతంలో కూడా సీఎంగా జిల్లాకు విత్తనశుద్ధి, సోలార్ హబ్, ఎయిర్ పోర్టు, ఉర్దూ, క్లస్టర్ లాంటి విశ్వవిద్యాయాలాంటివి ఎన్నో అమలుకు నోచుకున్నాయన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, కర్నూలు జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రైతులు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూసి కల్తీ విత్తనాలు, ఎరువులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్రం రామకృష్ణుడు, నాయకులు పోతురాజు రవికుమార్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.