పంటల బీమాతో రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు నిండా మునిగారు. విపత్తులు, అతివృష్టి, అనావృష్టి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. గత ఐదేళ్లలో జిల్లాలో 94,500 మంది రైతులకు సుమారు రూ.90కోట్లు మాత్రమే బీమా సొమ్ము చెల్లించి మమ అనిపించారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. ప్రకృతి విపత్తులతో పంట దెబ్బతిన్న రైతులను బీమాతో ఆదుకోవాలని సంకల్పించింది. ఆ దిశగా సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏ రైతుకు నష్టం జరగకూడదని, ప్రతి రైతునూ ఆదుకోవాలని నిర్ణయించారు. విపత్తుల సమయంలో రైతులకు న్యాయం చేసేలా బీమా అమలుపై చర్చించారు. త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.- 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించిన పంటలకు అగ్రికల్చరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలతో బీమా చేయించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపట్టారు. ఒకరకంగా ఆ ఐదేళ్లు రైతులకు స్వర్ణయుగమే. పంటలు ఏరకంగా దెబ్బతిన్నా ఆదుకోవడమే తరువాయి. పైలాన్, హుద్‌హుద్, తితలీ వంటి తుఫాన్లే కాకుండా దోమపోటుతో నష్టపోయిన సందర్భంలో కూడా రైతులకు పంట నష్టపరిహారం అందించారు. , మరోవైపు పెట్టుబడి సాయం, దోమపోటు నష్టానికి కూడా పరిహారం ఇచ్చారు. అన్నీ కలిపి ఐదేళ్లలో సుమారు రూ.360కోట్లు పైగా చెల్లించారు. - 2019-2024లోని వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా అని చెప్పి ప్రైవేట్ బ్యాంకులకు అప్పగించారు. కొంతమంది రైతులకు ప్రీమియం చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కేవలం గత ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.90 కోట్ల మేర మాత్రమే లబ్ధి దక్కింది. ఈ సారి కూటమి ప్రభుత్వం.. అందరికీ బీమా కల్పించేలా చర్యలు చేపట్టడం శుభపరిణామం అని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.