వైసీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో రూ. కోట్ల విలువైన దేవుడి భూములు అక్రమణకు గురయ్యాయని ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ దృష్టికి ఆమె వైసీపీ నాయకుల భూ ఆక్రమణలను తీసికెళ్లారు. ఈ సందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ మాధవ ఆంజనేయస్వామికి దాదాపు 188 ఎకరాలు భూమి ఉండగా రూ. కోట్ల విలువైన 70 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అలాగే ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలోని కాశీ విశ్వేశ్వరస్వామికి చెందిన భూముల్లోని మట్టిని వైసీపీ నాయకులు అమ్ముకుని వ్యాపారం చేశారని తెలిపారు. దీని వల్ల ఆ భూములు ఎందుకూ పనికి రాకుండా పోయాయన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్‌ల నిధులను దోచుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని స్పీకర్ ద్వారా మంత్రికి విన్నవించారు. విచారణ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని గౌరుచరిత సభను కోరారు.