ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం నగరంలోని తన నివాసంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడులను తగ్గిస్తేనే వ్యవసాయ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. కరువు జిల్లాలో రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటల పెంపకాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఐదు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు ఐదు ఎకరాల నుంచి పదెకరాల పొలం ఉన్నవారేనని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పది ఎకరాల్లోపు రైతులకు అవకాశం కల్పించాలనరి కోరారు. జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల సాగు దిశగా నడిపించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే అంశాన్ని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళతానని ఆమె తెలిపారు.