ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండల వానపల్లి గ్రామంలో 30వ రేషన్‌షాపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అక్కడ విధులు నిర్వహించాల్సిన డీలర్ లేకుండా ఆమె వేలిముద్రను క్లోనింగ్ చేసి ప్లాస్టిక్ వేలిముద్రతో వైసీపీకి చెందిన కొందరు బినామీలు షాపు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో విచారణ చేసి వాస్తవాలు వెలుగు చూడటంపై సంబంధిత డీలర్ సహా ఐదుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వానపల్లి 30వ రేషన్‌షాపును మర్రివారిపేటకు చెందిన డ్వాక్రా గ్రూప్ శ్రీ దుర్గా ఎంఎస్ ఎస్ గ్రూపునకు చెందిన మర్రి శ్రీకళ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్రి శ్రీకళ పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె నిర్వహించే రేషన్‌షాపును కొందరు బినామీలు నకిలీ వేలిముద్రతో నడుపుతున్నారని అదే గ్రామానికి చెందిన ఎన్.డాక్టర్‌బాబు, పల్లి ఏడుకొండలు, కొత్తపేట ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో విచారణాధికారిగా ఎంఎస్వో టి.శ్రీనివాస్‌ను నియమించారు. విచారణలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. డీలర్ మర్రి శ్రీకళ గ్రామంలో ఉండ టంలేదని ఆమె వేలిముద్రను క్లోనింగ్ చేసి బినామీ నిర్వహిస్తున్నారని తెలపడంతో పాటు బియ్యం పంపిణీలో తేడాలు ఉండటంతో సంబంధిత షాపుపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్వో టి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు షాపు నిర్వహిస్తున్న డీలర్‌తో పాటు షాపు నిర్వహిస్తున్న వారు, వారికి సహకరించిన సంబంధిత సిబ్బంది మర్రి శ్రీకళ, ఇసుకపట్ల సునీల్, నక్కా రాజేంద్ర, మర్రి రాంబాబు, రాపాక కౌశిక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.