ఓబుళదేవరచెరువు మండలంలోని వీరప్పగారిపల్లికి చెందిన అంగనవాడీ కార్యకర్త నాగమణి శనివారం ఆత్మహత్యాయత్నానకి పాల్పడింది. విధుల నుంచి తొలగించాలని కొంతమంది గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన ఆమె తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. అది బాగా వైరల్ అయ్యింది. నాగమణి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగనవాడీ యూనియన జిల్లా అధ్యక్షురాలు మాబున్నీసా, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, యూనియన ప్రాజెక్టు నాయకులు ఆశీ ర్వాదమ్మ, రంగమ్మ మాట్లాడుతూ... అంగనవాడీ కార్యకర్త నాగమణిని వేధించిన టీడీపీ నాయకుడు ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ ఖాజాబీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడనుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషనకు వెళ్లి, సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌కు, ఎస్‌ఐ వంశీకృష్ణ కు వినతిపత్రం సమర్పించారు. యూనియన నాయకురాళ్లు కమలమ్మ, సీఐటీయూ నాయకులు కుళ్లాయప్ప, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.