గృహ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆశాఖ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సిమెంటును కూడా తక్షణమే సరఫరా చేయాలన్నారు. ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో శనివారం గృహనిర్మాణ శాఖ, గ్రామ సచివాలయాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.50 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్న విషయాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి 2014-2019 కాలంలో నిర్మించుకున్న ఇళ్లకు కూడా వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నిలిపివేసిందన్నారు. వాటిని త్వరిగతిన చెల్లించేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.