వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అవినీతికి పాల్పడటంతోపాటు అక్రమాలు చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేయడంతోపాటు, ఆయన్ను కోర్టుకెక్కిస్తానని తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. జగన్ అరాచక పాలనలో తామేమీ తక్కువ కాదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి చేసిన అరాచకాలపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. వారిని కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తానని పేర్కొన్నారు. దీనిపై తాను స్వయంగా సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఒంగోలు వచ్చిన మంత్రి బాలినేని.. కనీసం వైసీపీ కార్యకర్తలను కూడా కలవకుండా హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నోటికొచ్చినట్లు టీడీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోయాడన్నారు.బాలినేని అవినీతికి పాల్పడకపోతే తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. చీమకుర్తి ప్రాంతంలో సర్వే నెం 55/3లో గ్రానైట్ వ్యాపారి శిద్దా హనుమంతరావు నుంచి 12 ఎకరాలు బలవంతంగా లీజుకు రాయించుకుని అక్రమాలకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా సర్వే నెం. 55/3లో 39 ఎకరాల స్థలాన్ని బాలినేని బినామీలకే ఇప్పించి గత ఐదు సంవత్సరాలలో రూ.15 కోట్లు మింగేశాడని ఆరోపించారు. గ్రానైట్ క్వారీలలో అక్రమంగా మైనింగ్‌చేయించి ఈసీ, ఎన్‌వోసీలు కూడా లేకుండా, కనీసం మైనింగ్ పర్మిట్లు కూడా లేకుండా అక్రమంగా రాళ్లను పోర్టుకు చేర్చిన ఘనుడు బాలినేని ధ్వజమెత్తారు. ఎంతో సౌమ్యులైనఆర్యవైశ్యులపై బాలినేని అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బాలినేని దర్జాగా తిరిగే టయోటా వెల్‌ఫేర్ కారు కమలాపురం రఘురెడ్డి ద్వారా ఆంజనేయులు అనే ఎలక్ర్టికల్ కాంట్రాక్టర్ దగ్గర కప్పంగా స్వీకరించలేదా? అంటూ నిలదీశారు. తాను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాలినేని సిద్ధంగా ఉండాలని పెద్దిరెడ్డి హెచ్చరించారు.