ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన 217 జీవోను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్క్ వేదికగా వెల్లడించారు. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే 217 జీవోని రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో మాటిచ్చానన్న నారా లోకేష్.. మాట ప్రకారం కూటమి ప్రభుత్వం జీవో 217ని రద్దు చేసి మత్స్యకారులకు మేలు చేకూర్చిందని అన్నారు.అన్నివర్గాల సంక్షేమమే మా ప్రజా ప్రభుత్వం లక్ష్యమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇక 217 జీవోను రద్దు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. మత్స్యకారులను ఇబ్బందిపెట్టే జీవోను రద్దుచేస్తామని చంద్రబాబు మాటిచ్చారని.. ఆయన మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇక చెప్పిన విధంగానే ఏపీ ప్రభుత్వం 217 జీవో రద్దు చేసింది. దీంతో యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 217 జీవో అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఈ జీవో కారణంగా మత్స్యకారులు సొంత ఊర్లల్లోని చెరువుల్లో చేపలు పట్టే హక్కును కోల్పోతారని విమర్శలు వచ్చాయి. ఈ జీవో ప్రకారం చేపలు పట్టడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచేది. టెండర్లు దక్కించుకున్నవారికే చేపలు పట్టే హక్కు ఉండేది. దీంతో అప్పట్లో ఈ జీవో మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. 217 జీవో ద్వారా మత్స్యకారుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా వారి ఉనికికి కూడా భంగం కలుగుతుందని విపక్షాలు ఆరోపించాయి.
అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం అన్ని చెరువులకు 217 జీవో వర్తించదని.. వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే జీవో వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక ఎన్నికల ప్రచారం సమయంలో మత్స్యకారులు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే యువగళం పాదయాత్ర సమయంలోనూ మత్స్యకారులు నారా లోకేష్ దృష్టికి 217 జీవో గురించి తీసుకెళ్లారు. దీంతో తాము అధికారంలోకి రాగానే ఈ జీవోను రద్దుచేస్తామని అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే.. టీడీపీ కూటమి ప్రభుత్వం 217 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మత్స్యకారులు సంబరాలు జరుపుకుంటున్నారు.