రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారత్‌కు చెందిన హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రవి మౌన్ మరణం గురించి సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కానీ, రవి మృతికి గల కారణాల గురించి మాత్రం అతడి కుటుంబ సభ్యులకు రాయబార కార్యాలయం వివరాలను ఇవ్వలేదని సమాచారం. డీఎన్ఏ పరీక్షల కోసం తల్లి నమూనాలను పంపాలని తమ కుటుంబసభ్యులను కోరిందని, ఆమె చనిపోవడంతో తండ్రి నమూనాలను పంపనున్నట్టు రవి సోదరుడు అజయ్ మౌన్ తెలిపారు.
అయితే, రష్యాకు వెళ్లి రవి ఆచూకీ తెలియక గత ఐదు నెలలుగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దంలో పాల్గొనాలని రష్యా సైన్యం రవిని బలవంతం చేసిందని ఆరోపించారు. రష్యా సైన్యంలోని భారతీయులను త్వరగా విడుదల చేయాలంటూ ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. వ్లాదిమిర్ పుతిన్‌ను కోరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో పాల్గొన్న ముగ్గురు భారతీయులు చనిపోయినట్టు గత నెలలో విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.
రవి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి వరకూ చదువుకున్న బాధితుడు ఈ ఏడాది జనవరిలో రష్యాకు వెళ్లాడు. రష్యా పంపడానికి తమ కుటుంబానికి చెందిన ఎకరం భూమిని అమ్మి, రూ.11.5 లక్షలు ఖర్చుచేశామని అజయ్ మౌని తెలిపారు. అక్కడ ట్రాన్స్‌పోర్టింగ్ ఉద్యోగం ఇప్పిస్తాననే హామీతో తమ గ్రామానికి చెందిన ఏజెంట్ పంపారని అన్నారు. తమ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి జనవరి 13న రష్యాకు వెళ్లాడని చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత మోసం చేసిన ఏజెంట్.. బలవంతంగా సైన్యంలో చేర్పించడాని వాపోయారు. యూనిఫామ్‌తో దిగిన ఫోటోలను చూసిన తర్వాత సైన్యంలో చేరినట్టు తెలిసిందన్నారు.
తర్వాత సొరంగాల తవ్వకంలో శిక్షణ ఇచ్చారని, తమ సోదరుడితో చివరిసారిగా మార్చి 12న మాట్లాడినట్టు అజయ్ వెల్లడించారు. మార్చి 6 నుంచి తాను యుద్ధభూమిలో ఉన్నట్టు ఆ రోజున చెప్పాడని, అప్పటి నుంచి తనతో కాంటాక్ట్ లేదని పేర్కొన్నారు. జులై 21న తన సోదరుడి ఆచూకీ కోసం రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్ పంపితే.. రవి చనిపోయినట్టు తాజాగా ధ్రువీకరించారని వివరించారు. ‘మీరు కోరినట్టు మృత దేహాన్ని భారత్‌కు పంపేందుకు రాయబార కార్యాలయం సంబంధిత రష్యన్ అధికారులను సంప్రదించింది.. భారతీయ యువకుడి మరణాన్ని రష్యా ధ్రువీకరించింది.. అయినప్పటికీ అతడ్ని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్ష చేయాలని కోరింది’ అని భారత రాయబార కార్యాలయం రవి కుటుంబానికి లేఖ రాసింది.