విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ లుక్ మారిపోయింది. ఈ రైలు ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మన్ బుష్)కి మారింది. ఈ నెల 22 నుంచి కొత్త కోచ్‌లతో నడుస్తోంది.. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో ఆధునిక సౌకర్యాలతో పాటుగా రెండు సైడ్ బెర్తులు మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించిందని చెబుతున్నారు. గరీబ్ రథ్‌కు గతంలో మూడు సైడ్ బెర్త్‌లు ఉండేవి.. మధ్యతరగతి ప్రయాణికులకు దృష్టిలో ఉంచుకొని ఎకానమీ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మొత్తం 18 బోగీలు ఉండగా.. ఒక్కో బోగీకి 80 సీట్ల చొప్పున 1440 సీట్లు ఉన్నాయి. కొత్త గరీబ్ రథ్‌లో పాత దానితో పోలిస్తే.. ప్రయాణికులకు అదనంగా 100 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. ఈ గరీబ్ రథ్ రైలు ఛార్జీల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే పరిశుభ్రమైన టాయిలెట్లతోపాటు అత్యాధునిక డస్ట్‌బిన్, వాష్ బేషిన్‌లు ఏర్పాటు చేయడంతో గరీబ్‌రథ్ రైలు చూడటానికి లుక్ అదిరింది. కొత్త లుక్‌లో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.
మరోవైపు విశాఖ నుంచి పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్‌తోపాటు, కొన్ని రైళ్ల గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12830) రైలు ఆగస్టు 1న మధ్యాహ్నం 12.10గంటలకు బదులు 1.10 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్- తిరుపతి (22879) ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 3న మధ్యాహ్నం 12.10గంటలకు బదులు 1.10 గంటలకు బయలుదేరేలా మార్చారు. పూరీ-గాంధీధామ్ (22974) ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.15 గంటలకు బదులు మధ్యాహ్నం 12.45గంటలకు బయల్దేరుతుందని తెలిపారు. విశాఖ-పలాస(07470) మెము రైలు.. ఈనెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ వరకే నడుస్తుందని.. మళ్లీ అక్కడి నుంచే విశాఖ వస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.