కొత్తపట్నం కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ పరిధిని తగ్గించే దిశగా జరుగుతున్న అభిప్రాయ సేకరణ అర్ధంతరంగా ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంగోలు జిల్లా అధికారులు మంగళవారం కొత్తపట్నం బీచ్‌లో ప్రజాప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంటు ప్లాన్ ఖరారు చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ, అటవీ శాఖలు దీన్ని చేపట్టాయి. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి, పొల్యూషన్ బోర్డు అధికారి రాఘవరెడ్డి, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే ఈ అభిప్రాయ సేకరణను అందరికీ తెలియజేయకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నాయకులు మత్స్యకారులను కూడగట్టారు. వారు పెద్ద సంఖ్యలో బృందావనం బీచ్ రిసార్టు వద్దకు చేరుకున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఈ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ మండల అధ్యక్షుడు ద్వారబాకుల శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు జంపాని రామచంద్రరావు, మత్స్యకారులు అఽధికారులను నిలదీశారు. అభిప్రాయ సేకరణ విషయం మీకైనా తెలుసా అంటూ కొత్తపట్నం తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్‌డీవోలకు ఫోన్ ద్వారా సంప్రదించారు. వారు తమకు తెలియదని చెప్పడంతో మత్స్యకారులు, టీడీపీ నాయకులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రహస్యంగా జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని, వెంటనే అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు. మత్స్యకారులు ఎక్కువ సంఖ్యలో చేరడంతో అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అఽధికారులకు మత్స్యకారులకు మఽధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులతో అధికారులు కలిసి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సీఆర్‌జడ్ పరిధిని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందని మత్స్యకారులు ఆరోపించారు. తీరప్రాంతంలో నివాసం ఉండేవారిని కాకుండా శింగరాయకొండలో సీఫుడ్స్ కంపెనీలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఈ కార్యక్రమానికి పిలిపించి తప్పుడు సమాచారం ప్రభుత్వానికి పంపాలని చూస్తున్నారని మత్స్యకారులు మండి పడ్డారు.