రాజమహేంద్రవరంలో పారిశుధ్యనిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన పలు డ్రైనేజీలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు పరిశీలించారు. నగరంలో రెండు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి డ్రైనేజీల్లో సిల్ట్, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించాలన్నారు. చెత్త పేరుకుపోయిన ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలన్నారు. నగరంలో చిరువ్యాపారులు ప్లాస్టిక్ డస్ట్‌బిన్నులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా జరిమానాలు విధించాలని ఆదేశించారు. కోటిలింగాలపేటలో నగరపాలక సంస్థ అందిస్తున్న మంచినీటిలో క్లోరిన్ శాతాన్ని పరిశీలించారు.ఆర్‌టీసీ కాంప్లెక్స్ , రైల్వేస్టేషన్ ప్రాంతాలను పరిశీలించి పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జి.పాండురంగారావు, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్ ఇంద్రగంటి శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.