యల్లనూరు మండల అభివృద్ధికి అందరం సమష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ప్రధాన శాఖల అధికారులు వారివారి శాఖల వివరాలను తెలపలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. నిధులు మంజూరైనా పనులను పూర్తిచేయలేని స్థితిలో గత ప్రభుత్వం నడిచిందన్నారు. మండలంలో ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తుతోందని, వీటికి పరిష్కారమార్గాలు ఏమని అడిగితే ఇక్కడి అధికారులు చెప్పలేని స్థితిలో ఉండడం దారుణమని అన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీలు పార్టీలకు అతీతంగా అందరం కలిసి సమస్యలపై చర్చించి మండలాన్ని అభివృద్ధివైపు నడిపిద్దామని ఈ సందర్భంగా ఆమె సభ్యులను కోరారు.