ఎవరైనా ఎక్కడైనా భూకబ్జాలకు పాల్పడితే సహించేంది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. బొమ్మనహాళ్ మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ పద్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత వ్యవసాయ, విద్య, విద్యుత, ఉపాధిహామీ పనులు తదితర వాటిపై చర్చ జరిగింది. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో బడిబయట పిల్లలు ఎవరూ ఉండకూడదని, అలాంటి వారిని ప్రతిఒక్కరినీ గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. మండలంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతుంటాయని, వాటిని దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవనకు, మంత్రి నారా లోకే్‌షకు అధికంగా భూకబ్జాలపై ఫిర్యాదులు అందుతున్నాయని, ఇక్కడ అలాంటివి జరిగితే ఉపేక్షించమని అన్నారు. భూకబ్జాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదల భూములను, స్థలాలను బలవంతులు లాక్కోవడం చాలా దుర్మార్గమన్నారు. మండలంలో అలాంటివి జరిగే ఉంటే వాటిని గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కు కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రఘునాథ్, ఈఓపీఆర్డీ దాస్, విద్యుత ఏఈ లక్ష్మిరెడ్డి, ఏఓ సాయికుమార్, జేఈఈ జగదీష్, ఎంపీటీసీ సభ్యులు ముల్లంగి కల్పన, తిమ్మప్ప, సర్పంచులు ముల్లంగి భారతి, భాస్కర్‌నాయుడు, వనమ్మ తదితరులు పాల్గొన్నారు.