గత వైసీపీ పాలనలో పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన మొదట విడత నాడు- నేడు పనుల్లో అ క్రమాలు జరిగాయని ఫిర్యాదు లు అందడంతో.. అక్రమార్కుల భరతం పట్టేందుకు కూడేరు డీఈఓ వరలక్ష్మి సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె మండలంలోని కమ్మూరు, కొర్రకోడు, కూడేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల్లో నాడు-నేడు పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. కమ్మూరు ప్రాథమిక పాఠశాలలో పనులు చేయడానికి స్కూల్ కమిటీ చైర్‌పర్సన మంజుల సంతకాలు రికార్డులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రికార్డుల్లో కమిటీ సభ్యులు సంతకాల్లో తేడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో అమర్చిన టైల్స్‌ను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో అప్పుడే పగిలిపోయాయని గ్రామస్థులు తెలిపారు. అలాగే విద్యార్థులకు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అనంతరం పాఠశాల కమిటీ చైర్‌పర్సన మంజుల రావడంతో రికార్డులో సంతకం ఎందుకు పెట్టలేదని డీఈఓ ప్రశ్నించారు. దీంతో ఆమె తనకు ఏమీ తెలియదని, కేవలం చెక్కుల మీద మాత్రమే సంతకాలు చేయించారని తెలిపారు. దీంతో డీఈఓ నాడు నేడు పనులకు సంబందించిన రికార్డును సీజ్ చేసి మరోసారి విచారణ చేస్తామని, అందరు రావాలని సూచించారు. అనంతరం కొర్రకోడు ప్రాథమిక పాఠశాలలో పనులకు సంబంధించిన రికార్డులు, ఓచర్లలను పరిశీలించారు. అక్కడా సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూడేరు ఆదర్శ పాఠశాలలో జరిగిన పనులపై గ్రామస్థులు డీఈఓకు వివరించారు. వివిధ గ్రామాల్లో నాడు-నేడు పనులపై పూర్తిస్థాయి విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.