స్కూలు యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీల) ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రుల కమిటీల స్థానంలో పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల షెడ్యూల్‌ను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల నిర్వహణకు గురువారం హెచ్‌ఎంలు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల జాబితాను ప్రకటించి నోటీసు బోర్డులో ఉంచుతారు. కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.ఆగస్టు 5వతేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసి నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహించి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రమాణస్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 మధ్య మొదట కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు మినహా మిగిలిన ఇతర యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల యాజమాన్య కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.